కామారెడ్డి, డిసెంబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆదిత్య వైద్యశాలలో, సాయి కృష్ణ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో ముత్యం పేటకు చెందిన సంతోష్ గౌడ్, కామారెడ్డికి చెందిన సత్తవ్వకు వారికి కావలసిన ఏ పాజిటివ్ రక్తాన్ని పట్టణానికి చెందిన బైక్ మెకానిక్ సతీష్ గౌడ్ సహకారంతో అందజేసి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యేవిధంగా సహకరించినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు.
రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2007వ సంవత్సరంలో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నాటి నుండి నేటి వరకు వేలాది మందికి, ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని, ప్లేట్లెట్లను, కరోనా సమయంలో ప్లాస్మాను అందజేయడం జరిగిందని, కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని స్ఫూర్తిగా తీసుకొని, కామారెడ్డి జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో రక్తదాతల సమూహాలు ఏర్పాటు కావడం చాలా సంతోషదాయకమని అన్నారు.
రక్తదానం వల్ల తోటి వారి ప్రాణాలను కాపాడడమే కాకుండా, రక్తదాతలు ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆపదలో ఉన్నవారు తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతం వారైనా 9492874006 కి సంప్రదించినట్లయితే వారికి కావలసిన రక్తాన్ని సకాలంలో అందజేస్తామన్నారు. కార్యక్రమంలో శివకృష్ణ, వి.టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్లు ఏసు గౌడ్, అర్చన పాల్గొన్నారు.