నిజామాబాద్, డిసెంబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ గిరిరాజ్ కాలేజీలో మౌళిక వసతులు కల్పించి సమస్యలు పరిష్కరించాలని పి.డి.ఎస్.యు గిరిరాజ్ కాలేజీ కమిటీ ఆధ్వర్యంలో కాలేజీ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణకి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా పి.డి.ఎస్.యూ నాయకులు వేణు మాట్లాడుతూ ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ, పీజీ కాలేజీలో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయన్నారు. కాలేజీ సమయంలో లైబ్రరీ తెరిచి ఉండటం లేదన్నారు. విద్యార్థులకు అవసరమైన కొత్త సిలబస్ పుస్తకాలు లేవన్నారు. వీటితో పాటు పోటీ పరీక్షల పుస్తకాలు కూడా ఉంచాలన్నారు.
పీజీ బ్లాక్‌లో కనీసం తాగునీరు ఉండటం లేదన్నారు. నీటి సదుపాయం లేక మూత్రశాలలు అధ్వానంగా ఉన్నాయన్నారు. విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందుబాటులో లేదన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన గిరిరాజ్ కాలేజీలో మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. వెంటనే కనీస వసతులు కల్పించాలని కోరామన్నారు. వారం రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని ప్రిన్సిపాల్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సాయి, అఖిల, ప్రసన్న, చరణ్, ముత్తన్న, మహేష్, నవీన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.