నసురుల్లాబాద్, డిసెంబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో ముందుగా బాన్సువాడ నియోజకవర్గంలో దాన్యం కొనుగోలు పూర్తి చేయడంవల్ల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని రాష్ట్ర శాసనసభపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామ శివారులో 13 వేల 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోదాములను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారని చెప్పారు.
గిడ్డంగుల కార్పొరేషన్ ద్వారా తమ నియోజక వర్గానికి మరిన్ని గిడ్డంగులు మంజూరు చేయాలని కోరారు. ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ మాట్లాడారు. గిడ్డంగుల సంస్థ ను అభివృద్ధి చేస్తానని చెప్పారు. గిడ్డంగుల కోసం రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డితో చర్చిస్తానని పేర్కొన్నారు.
సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి కమలాకర్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండి జితేందర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా డిసిసిబి అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి గౌరీ శంకర్, సర్పంచ్ యశోద, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.