కామారెడ్డి, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సావిత్రిబాయి పూలే గొప్ప మానవతావాది అని కామారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి పేర్కొన్నారు. సోమవారం బార్ అసోసియేషన్ హాల్లో సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్జెల బిక్షపతి మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, మానవ హక్కుల కోసం పోరాడిన మానవతా వాదిగా, సావిత్రిబాయి పూలేను కొనియాడారు.
అన్ని వర్గాలు విద్యలో ముందు ఉంటేనే నవ సమాజ నిర్మాణం జరుగుతుందని సావిత్రిబాయి పూలే ఆశించారన్నారు. ఆమె ఆశయాలను కొనసాగించవలసిన అవసరం అన్ని వర్గాలపై ఉందన్నారు. జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే ఆశయాలను కొనసాగించాలని గజ్జల బిక్షపతి తెలిపారు.
సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు జోగుల గంగాధర్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్, ప్రతినిధులు కాసర్ల శ్రీనివాస, సూర్య ప్రసాద్ దేవేందర్ గౌడ్, లతా, షబానా బేగం, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ వాదులు తదితరులు పాల్గొన్నారు.