డిచ్‌పల్లి, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలను తెలంగాణ విశ్వవిద్యాలయంలో బి.సి. సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బి.సి. సెల్ డైరెక్టర్ డా. బి. సాయిలు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిధిగా కళాశాల ప్రిన్సిపాల్ డా.ఏ. నాగరాజు హాజరయ్యారు.
ప్రిన్సిపాల్ ప్రసంగిస్తూ సావిత్రిబాయి ఫూలే ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని, పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి అని కొనియాడారు. సావిత్రిబాయి పేరుతొ తెలంగాణా రాష్ట్రంలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమానికి హాజరైన డా. వాసం చెంద్రశేఖర్ మాట్లాడుతూ సావిత్రిబాయి నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసి కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి అన్నారు.
ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మాట్లాడుతూ ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించి కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేసిందన్నారు.
ప్రొఫెసర్ ప్రవీణాబాయి ప్రసంగిస్తూ సావిత్రిబాయి సత్యశోధక్ సమాజ్‌ను ప్రారంభించి బాల్యవివాహలకు, మూఢనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేకంగా, వితంతువు పునర్వివాహల కొరకు అసమాన బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపిందని గుర్తుచేశారు.
కార్యక్రమంలో డా. పార్వతి, డా. అక్కేనపల్లి పున్నయ్య, పి.ఆర్.ఓ. డా. అబ్దుల్ ఖవి, డా. గులేహీరాన విద్యార్థి నాయకులు రాజేశ్వర్, సంతోష్, సరిత, శివశంకర్, నవీన, కీర్తన, రమేష్ తదితరులు పాల్గొని సావిత్రిబాయి సేవలను కొనియాడారు.