హైదరాబాద్, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ సభలను నిషేధించడంతో, నుమాయిష్‌గా ప్రసిద్ధి చెందిన వార్షిక ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జనవరి 10 వరకు నిలిపివేసినట్టు అధికారులు పేర్కొన్నారు.
కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి జనవరి 10 వరకు మత, రాజకీయ మరియు సాంస్కృతిక సహా అన్ని రకాల ర్యాలీలు, బహిరంగ సభలు, సామూహిక సమావేశాలను రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1 న నిషేధించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (ఏఐఐఈ) సొసైటీ సభ్యులు సోమవారం సమావేశం నిర్వహించారు. ఎగ్జిబిషన్‌ను స్వఛ్ఛందంగా మూసివేయాలని సొసైటీ నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాలను పాటించడానికి, తాము స్వఛ్ఛందంగా ప్రదర్శనను మూసివేయాలని నిర్ణయించుకున్నామని, నుమాయిష్‌ను మూసివేయమని ప్రభుత్వ అధికారులు లేదా పోలీసులు తమని సంప్రదించలేదని అధికారులు తెలిపారు.
ఈ ఏడాది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు దాదాపు 1,600 స్టాళ్లను ఏర్పాటు చేశారు. చెన్నై, కాశ్మీర్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ మొదలైన వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన డ్రై ఫ్రూట్స్, గింజలు, దుస్తులను ప్రదర్శించే స్టాల్స్ ఇప్పటికే నుమాయిష్ వద్ద ఏర్పాటు చేయబడ్డాయి.