కామారెడ్డి, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు ఆధునిక పద్ధతులను వినియోగించి కూరగాయల సాగు చేపట్టి అధిక లాభాలు పొందాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాజంపేట మండలం శివాయిపల్లిలో సోమవారం పంటల మార్పిడి విధానంపై ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రైతులు పోటీ తత్వంతో కూరగాయ పంటలు పండిరచాలని సూచించారు. రైతులు సంఘాలు ఏర్పాటు చేసుకొని కూరగాయల సాగును చేపట్టాలని సూచించారు. తీగజాతి కూరగాయలు పందిరి విధానంలో సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించే వీలుందని పేర్కొన్నారు. రైతులు మూడు నుంచి నాలుగు టన్నుల కూరగాయలు పండిస్తే మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కూరగాయల పంటలను రైతులు పండిరచాలని కోరారు. సేంద్రియ విధానంలో పంటలు సాగు చేసే రైతులు మంగళవారం కలెక్టరేట్‌లో జరిగే అవగాహన సదస్సుకు హాజరు కావాలని పేర్కొన్నారు. కూరగాయలు సాగు చేసే రైతులు తీగజాతి పందిరి వేయడానికి ఉపాధి హామీ ద్వారా పనులు చేపట్టి బిల్లులు పొందవచ్చని కోరారు. జిల్లా ఉద్యానవన అధికారి సంజీవరావు మాట్లాడారు.
రైతులు కూరగాయలు నర్సరీలను ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. కూరగాయ పంటలు మల్చింగ్ విధానాన్ని అవలంబించాలని కోరారు. తుంపర్లు, బిందుసేద్యం ద్వారా కూరగాయలు సాగు చేసుకోవచ్చని పేర్కొన్నారు. తీగజాతి కూరగాయలు సాగుచేసిన గురువారెడ్డి అనే రైతు వ్యవసాయ క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ విట్టల్ రెడ్డి, జడ్పిటిసి సభ్యుడు హనుమాన్లు, ఎంపీడీవో బాలకిషన్, తహసిల్దార్ జానకి, క్లస్టర్ ఉద్యానవన అధికారి రాజు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.