కామారెడ్డి, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 10వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో రైతుబంధు వారోత్సవాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో మంగళవారం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుబంధు, భీమ, యాసంగిలో పంటల నమోదుపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ నెల 3 నుంచి రైతుబంధు వారోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. జిల్లాలోని 2,71,615 మంది రైతుల ఖాతాలలో ఎనిమిది విడతలుగా రూ.1760 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. సహకార సంస్థ ఇప్‌కో క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. నానో ద్రవ యూరియా సహకార సంఘాలలో అందుబాటులో ఉంచాలని వ్యవసాయ అధికారులను కోరారు.
కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇఫ్‌కో మేనేజర్ నరేష్, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.