కామారెడ్డి, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు చైతన్యవంతుడైనప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం జిల్లా ఎన్నికల విభాగం ఆధ్వర్యంలో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, డిగ్రీ, వృత్తివిద్య కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రొజెక్టర్ల ద్వారా విద్యార్థులకు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్తగా నమోదైన ఓటర్లు ఓటుహక్కును నిజాయితీతో వినియోగించుకోవాలని సూచించారు. తమ ప్రాంతంలోని ఓటర్లలో చైతన్యం కలిగించాలని కోరారు. స్థానిక సంస్థలైనా, చట్టసభలకు పోటీచేసే అభ్యర్థులైనా వారి గుణగణాలు తెలుసుకొని సమర్ధుడైన నాయకుడికి ఓటు వేయాలి. రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కు ద్వారానే దేశంలో ప్రజాస్వామ్యం రక్షించబడుతుందని పేర్కొన్నారు.
ఈనెల 25 న జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలోని అన్ని కళాశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించాలని కోరారు. విజేతలకు జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున బహుమతులు అందజేయాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం ఎన్నికల విభాగం అధికారి సాయి భుజంగరావు, స్వీప్ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ వి.శంకర్, సిబ్బంది రవి, ప్రవీణ్, జిల్లాలోని కళాశాలల ప్రిన్సిపాళ్లు, సమన్వయకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.