డిచ్‌పల్లి, జనవరి 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్ లింబాద్రి అధ్యక్షతన కార్యక్రమం జరిగిందని వీసీ అన్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో పాటుగా తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఎం. మహేందర్ రెడ్డి పాల్గొన్నారని పేర్కొన్నారు.
తప్పుడు ధ్రువపత్రాలను అరికట్టడం ఎలా అన్న ‘‘ఏకాంశ ఎజెండా’’ గా సమావేశం నడిచిందని విసి పేర్కొన్నారు. వివిధ విశ్వవిద్యాలయాల పేరు మీదుగా తప్పుడు ధ్రువపత్రాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో వాటిని అరికట్టే దిశలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమావేశంలో చర్చించామని తెలిపారు. డిగ్రీ కోర్సులకు చెందిన తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించి అక్రమాలకు పాల్పడుతున్న సందర్భంలో విశ్వవిద్యాలయాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారని పేర్కొనారు.
ఇటువంటి సైబర్ క్రైం నేరాలకు పాల్పడినప్పుడు చట్టపరమైన శిక్షలు ఎలా ఉంటాయో డిజిపి ఎం. మహేందర్ రెడ్డి వివరించారని అన్నారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి, విద్యార్థుల్లో భయాందోళనలను తొలగించాలని డిజిపిని ఈ సందర్భంగా ఉపకులపతులు కోరారు.
కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రి, వైస్ చైర్మన్ ఆచార్య వెంకట రమణ, డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటి వీసీ ఆచార్య డి. రవీందర్, కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య తాటికొండ రమేష్, తెలంగాణ యూనివర్సిటి ఆచార్య డి. రవీందర్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆచార్య గోపాల్ రెడ్డి, శాతవాహన యూనివర్సిటి వీసీ ఆచార్య మల్లేష్ సంకశాల, పాలమూరు యూనివర్సిటీ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్, అంబేద్కర్ యూనివర్సిటి వీసీ ఆచార్య సీతారామా రావు, జెఎన్‌టియూ వీసీ ఆచార్య కట్టా నర్సింహా రెడ్డి తదితర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.