బోధన్, జనవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జీవో నెంబర్ 317 ను వెంటనే రద్దు చేయాలని, పప్పుల సురేష్ కుటుంబ ఆత్మహత్యలకు కారకులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మంగళవారం బోధన్ ఆర్డీవో కార్యాలయం ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేసి, వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఐ. ఎఫ్. టీ. యూ జిల్లా కార్యదర్శి బి. మల్లేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021 డిసెంబర్ 6వ తేదీన రాష్ట్రంలో జిల్లాలు జోన్లు, మల్టీ జోన్లను ఎంప్లాయీస్, టీచర్ల లోకేషన్ కోసం జీవో నంబర్ 317 తీసుకు వచ్చిందని ఈ జీవో రద్దు కై ఎక్కడికక్కడ ఆందోళనలు నిరసనలు చేసి, విద్యాశాఖ మంత్రి ఇంటి వద్ద ధర్నా చేసి హైకోర్టులో 60కి పైగా ఫీల్స్ వేసి గవర్నర్ తమిళిసై కి ఫిర్యాదులు చేసినప్పటికీ ప్రభుత్వం మొండిగా పట్టుపట్టడంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన సరస్వతితో పాటు తొమ్మిది మంది వరకు మరణించారని అయినా ప్రభుత్వం జీవో రద్దు చేయకపోవడం విచారకరమన్నారు.
ఇంకా ఎంతమంది చనిపోవాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే 317 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా బోధన్ ఆచన్‌పల్లి నుండి నిజామాబాద్‌కు వెళ్లి బ్రతుకుతున్న పప్పుల సురేష్‌కు అప్పులు ఇచ్చిన వారు వేధింపులకు గురిచేయడంతో వారి కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని వారి ఆత్మహత్యలకు కారణమైన రుణదాతలపై కఠిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు.
కార్యక్రమంలో పీవోడబ్ల్యూ పట్టణ అధ్యక్షురాలు బి. నాగమణి, జిల్లా నాయకులు బిపాషా బేగం, రేహానా బేగం, ఏఐకేఎంఎస్ నాయకులు సిహెచ్ గంగారాం, ఐ.ఎఫ్.టీ. యూ నాయకులు సి.హెచ్. యాదగిరి గౌడ్, శ్రీను, పీడీఎస్‌యూ నాయకులు బి. చందు, గన్ను తదితరులు పాల్గొన్నారు.