నిజామాబాద్, జనవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వడ్డీ వ్యాపారుల ఆగడాలను అరికట్టాలని, పప్పుల సురేష్ కుటుంబ సభ్యుల మరణాలకు కారణమైన బిజెపి నాయకుడు, ఇతర వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పివైఎల్, పివోడబ్ల్యు, ఐఎఫ్‌టియు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్‌కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా పీవైఎల్ జిల్లా అధ్యక్షులు బి.కిషన్, ప్రధాన కార్యదర్శి ఎం.సుమన్, పీవోడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కే. సంధ్యారాణి, ఐ.ఎఫ్.టి.యు జిల్లా నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ పప్పుల సురేష్ కుటుంబ బలవన్మరణానికి కారణమైన కరిపె గణేష్, జ్ఞానేశ్వర్, చంద్రశేఖర్, వినీత తదితరులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
సురేష్ కుటుంబ ఆత్మహత్యలకు అధిక వడ్డీల రూపంలో తీవ్ర వేధింపులు చేయడమే కారణంగా కనబడుతుందన్నారు. ముఖ్యంగా నగరానికి చెందిన కరిపె గణేష్ అనే వడ్డీ వ్యాపారి బిజెపి నాయకుడిగా చెలామణి అవుతూ చాలామందిపై వేధింపులకు పాల్పడ్డాడని అన్నారు. గతంలో ఇద్దరి ఆత్మహత్యలకు కరిపె గణేష్ వేధింపులే ప్రధాన కారణమన్నారు. కరిపె గణేష్‌కు చాలామంది అమాయక ప్రజలను హింసించిన చరిత్ర ఉందన్నారు. ఇతన్ని పార్టీ నుంచి బహిష్కరించాలని బీజేపీని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేస్తూ అధిక వడ్డీలు వసూలు చేస్తూ అమాయక ప్రజల జీవితాలతో గణేష్ లాంటివారు చెలగాటం ఆడుతున్నారన్నారు. నిజామాబాద్ జిల్లాలో అధిక వడ్డీలతో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తూ, ప్రజలను పీడిస్తున్న వడ్డీ వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా నాయకులు తారాచంద్, మనోజ్, రాజ్ మహమ్మద్ ఐ.ఎఫ్.టి.యు నాయకులు విఠల్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.