కామారెడ్డి, జనవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల్లోని అంగన్ వాడి కేంద్రాలలో రక్తహీనత లోపం ఉన్న పిల్లలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం వైద్యులు, ఐసిడిఎస్ అధికారులు, ఐకెపి అధికారులతో రక్తహీనత లోపం ఉన్న పిల్లలపై వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
గ్రామాల్లోని అంగన్‌వాడి కేంద్రాల్లో ఉన్న పిల్లలను ఆర్‌బిఎస్‌కేటీంలు పరిశీలించి వారికి అదనంగా పౌష్టికాహారం అందించే విధంగా చూడాలన్నారు. పిల్లలకు సరైన వైద్యం అందించి రక్తహీనత లోపం నుంచి బయట పడే విధంగా చూడాలన్నారు. ఎత్తుకు తగ్గ బరువు లేని వారిని గుర్తించి వారికి అదనంగా పోషకాహారం అందించే విధంగా చూడాలని కోరారు.
రక్తహీనత లోపంతో ఉన్న పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు సలహాలు, సూచనలు అందించాలని పేర్కొన్నారు. ఐకేపీ అధికారులు గ్రామ సంఘాలలో మహిళా ఆరోగ్య సమితి సమావేశం ఏర్పాటు చేసి రక్తహీనత ఉన్న పిల్లల గురించి చర్చించాలని కోరారు. అంగన్‌వాడి కార్యకర్తలు బాలామృతం పిల్లలకు అందించే విధంగా చూడాలని పేర్కొన్నారు.
ఐకెపి, మెప్మా సిబ్బంది దివ్యాంగులు వాడుతున్న మరుగుదొడ్ల పై సర్వే చేసి వారికి కావలసిన సౌకర్యాలను గుర్తించాలని చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని వైద్యులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్య అధికారిని కల్పన కంటే, జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ అధికారిని సరస్వతి, ఆయుష్ వైద్యుడు వెంకటేశ్వర్లు, సిడిపివోలు, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు.