కామారెడ్డి, జనవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రజలు సురక్షితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం పోలీస్, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్, రోడ్డు రవాణా శాఖ అధికారులతో రోడ్డు భద్రత నియమాలపై సమీక్ష నిర్వహించారు.
హెల్మెట్ లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ మంది వ్యక్తులు మృత్యువాత పడుతున్నారని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ లేకుంటే తప్పనిసరిగా జరిమానాలు విధిస్తారని పేర్కొన్నారు. అతి వేగంగా వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని సూచించారు. జిల్లాలో పది చోట్ల ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్‌లను గుర్తించినట్లు చెప్పారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించారు.
గత ఏడాది 515 రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పారు. ఈ ప్రమాదాల వల్ల 279 మంది మృతి చెందినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. మద్యం సేవించి వాహనాలు నడప వద్దని సూచించారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని చెప్పారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేయవద్దని కోరారు. ద్విచక్రవాహనాలపై ముగ్గురు వ్యక్తులు వెళ్లవద్దని చెప్పారు.
అన్ని వర్గాల ప్రజలు రోడ్డు భద్రత నియమాలు పాటించి సురక్షితంగా ఉండాలని కోరారు. ప్రజా ప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు తమకు సహకరించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఏఎస్పీ అన్యోన్య, డీఎస్పీలు సోమనాథం, జైపాల్ రెడ్డి, శశాంక్ రెడ్డి, ఆర్ అండ్ బి డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాస్, రోడ్డు రవాణా, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.