కమ్మర్‌పల్లి, జనవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
బుధవారం జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా కమ్మరపల్లి మండలం చౌటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. భారత దేశ సంస్కృతిని, ఔనత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహనీయుడని అన్నారు.
నేటి యువత జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మంచి ఆదర్శాలను, అలవాట్లను అలవర్చుకోవాలని, యువత స్వామి వివేకానంద ఆదర్శాలను స్వీకరించి జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోవాలన్నారు. స్వామి వివేకానంద భారతీయతకు చిహ్నం అని, ఆయన జీవితంలో అనేక కష్టాలు అనుభవించి ఉన్నత స్థాయికి ఎదిగారని, ప్రస్తుతం విద్యార్థులు వివేకానందుడి ఆదర్శాలను తీసుకొని జీవితంలో ముందుకు సాగాలని అన్నారు.
యువత తలుచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలదని, నిరాశ నిస్పృహలకు యువత లోను కాకుండా స్వామి వివేకానంద సూక్తులు ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. కార్యక్రమములో రాజ్యసభ సభ్యులు కెఆర్ సురేష్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ ఆరుట్ల రాజేశ్వర్, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.