నిజామాబాద్, జనవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం లో భాగంగా 2022 జనవరి ఒకటవ తేదీ నాటికి 18 సం. లు నిండి ఓటర్లుగా నమోదైన వారికి ఫోటో ఓటర్ గుర్తింపు కార్డులు (ఎపిక్ కార్డు) లు బి.ఎల్.ఓ.ల ద్వారా అంద చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డా. శశాంక్ గోయల్ అధికారులకు సూచించారు. బుధవారం హైద్రాబాద్ నుండి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా సిఇవో మాట్లాడుతూ, నూతన ఓటర్ల నమోదు, కొత్తగా ఓటర్లుగా నమోదైన వారికి ఎపిక్ కార్డులు పంపిణీ తదితర విషయాలపై సూచనలు చేశారు. జనవరి 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా ప్రస్తుతం కొత్తగా ఓటు హక్కు పొందిన యువతకు తమ ఎపిక్ కార్డును పోస్టు ద్వారా గాని గ్రామ పంచాయతీ ద్వారా గాని అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.
ఓటర్ కిట్‌లో జిల్లా కలెక్టర్ లేఖ, ఓటర్ గైడ్, ఓటర్ ప్రతిజ్ఞ, ఎపిక్ కార్డు కలిగి ఉంటుందని అన్నారు. ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ అని, 18 సంవత్సరాలు నిండి ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులు, సవరణకు వచ్చిన దరఖాస్తులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, ఏకరీతిగా ఫోటోలు ఉన్న జాబితా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఈ నెల 17వ తేదీన ఆయా జిల్లాలకు సంబంధించిన ఎపిక్ కార్డులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుండి తీసుకువెళ్లాలని ఆదేశించారు. జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన యువత ఆన్‌లైన్ ద్వారా ఓటరు జాబితాలో తమ పేరు నమోదుకు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రచారం, అవగాహన కల్పించాలని తెలిపారు.
స్వీప్ యాక్టివిటి నిర్వహించి ఓటు హక్కు పై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, జిల్లాలో నూతన ఓటర్లుగా నమోదైన 5 వేల 933 మందికి జాతీయ ఓటర్ దినోత్సవం జనవరి 25 నాటికి ఫోటో ఓటర్ గుర్తింపు కార్డుతో పాటు, ఓటర్ కిట్ అందచేస్తామని తెలిపారు. ఓటర్ నమోదు, మార్పులు, చేర్పులకు వచ్చిన దరఖాస్తులు పరిష్కరిస్తామని తెలిపారు.
తమ ఓటర్ వివరాలకు సంబంధించి సమాచారాన్ని ఓటర్ హెల్ప్ లైన్ ఆప్‌లో చూసుకునే విధంగా ఓటర్లకు అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్వీప్ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికి తగు చర్యలు తీసుకుంటామని సీఈవోకు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు వినోద్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.