రైతుబంధు లాంటి పథకం ప్రపంచంలోనే లేదు

వేల్పూర్‌, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు బంధు పథకం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదని అంత గొప్ప పథకాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. రైతుబంధు ఉత్సవాల్లో భాగంగా బుధవారం వేల్పూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కెఆర్‌ సురేష్‌ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో వ్యవసాయంలో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని రెండవ పంట వేయడానికి కూడా నీరు లేక సదుపాయాలు లేక చాలాచోట్ల ఒకటే పంటకు పరిమితమయ్యారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలవల్ల, సౌకర్యాల వల్ల రెండు పంటలు కూడా ఆనందంగా సాగు చేస్తున్నారని తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి నేరుగా పెట్టుబడి సబ్సిడీ ప్రతి ఎకరాకు గతంలో సీజన్‌ కి నాలుగు వేల చొప్పున, ప్రస్తుతం 5 వేల చొప్పున మొత్తం ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు రైతుబంధు సబ్సిడీ కింద పంటల సాగు ప్రారంభానికి ముందే రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయడం మరి ఎక్కడా లేదన్నారు.

ఈ విషయంలో రైతులు ఎవరి వద్దకు కూడా వెళ్లవలసిన అవసరం లేదని కేవలం పాసు బుక్కు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ అందిస్తేనే అన్ని వివరాలు నమోదు చేసి డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికీ ఎనిమిది విడతలుగా రైతుల ఖాతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల కోట్ల రూపాయలు అందించడం జరిగిందని పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో మొత్తం 50 వేల కోట్ల బడ్జెట్‌ కూడా ఉండదని కానీ మన రాష్ట్రంలో కేవలం రైతుబంధు కిందనే ఇంత పెద్ద మొత్తం చెల్లించడం జరిగిందని ఆయన ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇంత పెద్ద మొత్తం ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయడంపై రైతుల్లో ఎంతో సంతోషం, కృతజ్ఞతలు కనిపిస్తున్నదని దాని ద్వారానే వారంతా స్వయంగా రైతు బంధు ఉత్సవాలు గ్రామ గ్రామాన నిర్వహించుకుంటూ ఉన్నారని తెలిపారు. ఎన్నికల ర్యాలీల కంటే కూడా గొప్పగా ర్యాలీలు నిర్వహిస్తున్నారన్నారు. దీన్నిబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయం గురించి వారి మనసుల్లో కృతజ్ఞత కనిపిస్తుందని ఆయన అన్నారు.

కార్యక్రమంలో కెఆర్‌ సురేష్‌ రెడ్డి మాట్లాడుతూ, గతంలో ఎన్నడు వ్యవసాయం ఇంత పెద్దగా జరగడం చూడలేదని గతంలో వలసలు, ఆత్మహత్యలు జరిగాయని కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల కళ్లకు కనిపించినంత మేరకు పచ్చని పొలాలు ఉంటాయని, ఎక్కడ కూడా భూమి పడీత్‌ కనిపించదని గతంలో ఆంధ్ర నుండి వచ్చి ఇక్కడ భూములు కొన్నారని, ప్రస్తుతం మన భూములకు వచ్చిన విపరీతమైన డిమాండ్‌ వల్ల ఆంధ్ర వెళ్లి మన వాళ్ళు భూములు కొంటున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా మహిళలు వ్యవసాయంలో అప్పటికీ ఇప్పటికీ తేడాను చూపిస్తూ వేసిన ముగ్గులను వారు పరిశీలించారు. డిసిసిబి వైస్‌ చైర్మన్‌ రమేష్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ ఏడి గోవిందు, ఆర్మూర్‌ ఆర్డీవో శ్రీనివాసులు, ఎంపీపీ జమున, జెడ్పిటిసి ఎల్లకొండ భారతి, ఆర్టిఏ సభ్యుడు రేగుల రాములు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు మోహన్‌ రెడ్డి, స్థానిక సర్పంచ్‌ తీగల రాధ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షురాలు మంజుల, ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Check Also

24 మందికి గల్ఫ్‌ ఎక్స్‌ గ్రేషియా

Print 🖨 PDF 📄 eBook 📱 జగిత్యాల, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »