కామారెడ్డి, జనవరి 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీ వోలతో ఉపాధి హామీ పనులపై జరిగిన సమీక్ష సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. పాజిటివ్ వచ్చినవారు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలన్నారు.
కరోనా మహమ్మారిని అంతమొందించాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ అన్నారు. పండుగ పర్వ దినాలలో జనాలు ఎక్కువ ఒకే దగ్గర గుమిగూడే అవకాశం ఉండడం, సొంత గ్రామాలకు ప్రజలు వెలుతుండడం వల్ల వ్యాధి వ్యాప్తి వేగంగా జరిగే అవకాశం ఉందన్నారు. ప్రయాణాల్లో ప్రజలు ప్రభుత్వం నిర్దేశిత నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కోరారు. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్ ఖచ్చితంగా ధరించాలని అన్నారు.
కరోనా కోరల నుంచి తప్పించుకునేందుకు టీకానే ప్రధాన ఆయుధమని అన్నారు. 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వాక్సినేషన్ విధిగా తీసుకోవాలన్నారు. జిల్లా లో ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు, వీరితో పాటు 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు, కొన్ని తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి బూస్టర్ డోస్ పంపిణీ ప్రక్రియ ప్రారంభ మైనందున సాధ్యమైనంత త్వరగా అర్హులందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించారు.
బాధ్యత గల పౌరులుగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జిల్లాలో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని పేర్కొన్నారు. వైకుంఠ ధామాలు, కంపోస్టు షెడ్లు అన్ని గ్రామాల్లో వినియోగంలో ఉండేవిధంగా చూడాలని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా అటవీ ప్రాంతాల్లో కందకాలు తవ్వే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలలో 100 శాతం మొక్కలు నాటాలని కోరారు.