నిజాంసాగర్, జనవరి 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆరోపించారు. శుక్రవారం జుక్కల్‌లో విలేకరులతో మాట్లాడారు.
రైతు నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ తెరాస ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టంతో దానిని రద్దుచేశారని, ప్రస్తుతం 50 నుండీ వంద శాతం ఎరువుల ధరలను పెంచి రైతు నడ్డి విరిచి కార్పొరేట్ సంస్థలకు మేలుచేస్తున్నారని, వరి ధాన్యాన్ని సైతం కొనుగోలు చెయ్యకుండా రైతుల కడుపు కొడుతున్నారని షిండే ఆందోళన వ్యక్తం చేశారు.
2018 న రైతు ఆదాయం రెట్టింపు చేస్తానని గద్దెనెక్కి రైతు కడుపులో మంట పెట్టారన్నారు. తెలంగాణ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజు చేయాలన్న ఉద్దేశ్యంతో, రైతు పెట్టుబడి, రైతు భీమా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నారని కేసీఆర్‌ని విమర్శించే అర్హత బిజెపికి లేదని ఎమ్మెల్యే అన్నారు.
వృధా జలాలను సద్వినియోగం చేసుకొంటే దేశంలోని ప్రతి రైతుకు సాగు నీరు అందుతుందనే ధ్యాస మోడీకి లేదని కులమతాలు అడ్డం పెట్టుకొని ప్రజలకు మాయ మాటలు చెప్పి గద్దె నెక్కటం బీజేపీకి అలవాటని ఇక ముందు ఇవన్నీ సాగవన్నారు. ఎరువుల ధరలు తగ్గించే వరకు తెరాస పోరాటం సాగుతుందని హన్మంత్ షిండే అన్నారు.