నిజామాబాద్, జనవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం, దళిత బంధు కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వచ్చే మరో ఆరు నెలల పాటు ఈ రెండు కార్యక్రమాల పైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి హరితహారం, దళిత బంధు కార్యక్రమాలపై కలెక్టర్ సి.నారాయణరెడ్డి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వీటిని విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలు, రూపొందించాల్సిన ప్రణాళికలు, సాధించాల్సిన ఫలితాల గురించి దిశా నిర్దేశం చేశారు.
ఎనిమిదవ విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆయా శాఖల అధికారులు అంకిత భావం, చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు. క్రితం సారి హరితహారం మొక్కలు నాటే కార్యక్రమంలో ఒకింత వెనుకంజలో ఉండిపోయామని, ఈసారి మాత్రం ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా ప్రణాళిక బద్దంగా మొక్కలు విరివిగా నాటేందుకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. కేవలం మొక్కలు నాటడంతోనే సరిపెట్టుకోకుండా వాటి సంరక్షణకై పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ఇదే విషయాన్ని ఆయా శాఖల వారీగా మంగళవారం సమావేశాలు ఏర్పాటు చేసుకుని క్షేత్ర స్థాయి సిబ్బందికి తెలియజేయాలని జిల్లా అధికారులను సూచించారు. హరితహారం కింద నాటిన ఏ ఒక్క మొక్క చనిపోయినా ఉద్యోగం ఊడుతుందని సిబ్బందికి స్పష్టం చేశారు. ఇదివరకటి తరహాలోనే వ్యవహరిస్తాం అంటే ఎంత మాత్రం కుదరదని, ప్రతి గ్రామపంచాయతీ వారీగా ఆయా శాఖల అధికారులందరికీ హరితహారం మొక్కల పెంపకం, వాటి సంరక్షణ చర్యలపై స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. హరితహారం అమలులో గ్రామపంచాయతీలు, అటవీ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీలు రోడ్లు భవనాల శాఖలతో పాటు నేషనల్ హైవే అథారిటీ క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు.
కాగా, దళితబంధు పథకం అమలుపై కలెక్టర్ సి.నారాయణరెడ్డి జిల్లా అధికారులను కీలక సూచనలు చేశారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో ఏయే యూనిట్లను ఏర్పాటు చేయవచ్చు అన్నది గుర్తిస్తూ, వాటిని నెలకొల్పేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కేవలం పది లక్షల రూపాయల లోపు విలువ చేసే యూనిట్లను మాత్రమే ఏర్పాటు చేయాలనే నిబంధనలు ఏమీ లేవని, అంతకంటే ఎక్కువ, లేదా తక్కువ విలువ చేసే యూనిట్లను కూడా ఏర్పాటు చేయవచ్చని సూచించారు. అయితే ఏర్పాటు చేయబోయే యూనిట్లు స్థానిక జిల్లా పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలన్నారు.
మినీ డెయిరీ, పందిరి కూరగాయల సాగు, వేప నూనె తయారు చేసే యంత్రం, కోడిపిల్లలు పెంపకం యంత్రం, సెవెన్ సీటర్ ఆటో రిక్షా, మూడు చక్రాల ఆటో, టెంట్ హౌస్, ఆయిల్ మిల్, పిండి గిర్నీలు, పాసెంజర్, వాస్తు రవాణా వాహనాలు, డయాగ్నోస్టిక్ ల్యాబ్, మెడికల్ షాపులు, సానిటరీ షాపులు, సిమెంట్ ఇటుకల తయారీ, సెంట్రింగ్, మార్బల్స్ షాప్, హోటల్, క్యాటరింగ్, సూపర్ బజార్, పశువులు, కోళ్ల దాన తయారీ, మొబైల్ రిపేరింగ్, నర్సరీలు తదితర యూనిట్లను జిల్లాలో ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు.
దళిత బందు ఎంతో మంచి కార్యక్రమం అని, దీని ద్వారా ఎంతో మందికి శాశ్వత ప్రాతిపదికన ఉపాధి కల్పించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. అందువల్ల జిల్లా అధికారులు అంకిత భావంతో దీనిని అమలు చేసి విజయవంతం చేసేందుకు కృషి చేయాలని హితవు పలికారు. సమావేశంలో జడ్పి సిఈఓ గోవిందనాయక్, డీపీవో జయసుధ, జిల్లా వ్యవసాయ అధికారి మేకల గోవింద్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, డ్వామా పీడీ రాములు, ఆర్టీసీ ఆర్‌ఏం సుధా పరిమళ, నిజామాబాదు, ఆర్మూర్ ఆర్డీవోలు రవి, శ్రీనివాస్ తదితరులతో పాటు ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.