కామారెడ్డి, జనవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోజు రోజుకు తీవ్రమవుతున్న కరోనా దృష్ట్యా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టులలో జనవరి 31 వరకు వర్చువల్ విధానంలోనే వాదనలు కొనసాగుతాయని జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల బిక్షపతి తెలిపారు. ఈ మేరకు సోమవారం జరిగిన బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకుని తీర్మానించినట్లు బిక్షపతి పేర్కొన్నారు. ఇట్టి సమాచారాన్ని న్యాయమూర్తులకు తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు.
అత్యవసర కేసులు మాత్రమే నడుస్తాయని ఆయన పేర్కొన్నారు. న్యాయవాదులను సంప్రదించిన తర్వాతనే కక్షిదారులు కోర్టుకు రావాలని ఆయన పేర్కొన్నారు. అత్యవసర కేసుల్లో కోర్టుకు వచ్చే న్యాయవాదులు, జుడిషియల్ ఉద్యోగులు, కక్షిదారులు, కోవిడ్ 19 నిబంధనలు కచ్చితంగా పాటించాలని, డబుల్ మాస్కు ధరించాలని, గంటకోసారి శానిటైజర్ ఉపయోగించాలని ఆయన పేర్కొన్నారు.
కరోనా కట్టడికి అన్ని వర్గాల ప్రజలు కరోనా ప్రోటోకాల్ పాటించాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోలా శ్రీకాంత్ గౌడ్, ఉపాధ్యక్షులు జోగులా గంగాధర్, ప్రతినిధులు జగన్నాథం, శంకర్ రెడ్డి, సూర్య ప్రసాద్, దేవేందర్ గౌడ్, షబానా బేగం, లతా, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.