నిర్లక్ష్యానికి తావిచ్చి… సస్పెన్షన్‌ పరిస్థితి తెచ్చుకోవద్దు

నిజామాబాద్‌, జనవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న హరితహారం కార్యక్రమం అమలులో నిర్లక్ష్యానికి తావిస్తే సస్పెన్షన్‌ వేటు తప్పదని, అధికారులు, సిబ్బంది ఎవరు కూడా ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హితవు పలికారు. హరితహారం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నర్సరీల ఏర్పాటు తదితర అంశాలపై బుధవారం సాయంత్రం కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏపీవోలతో సమీక్ష జరిపారు.

ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, వచ్చే ఆరు నెలల పాటు మొక్కల పెంపకం, వాటి నిర్వహణ విషయంలో అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎక్కడైనా నిర్లక్ష్యానికి ఆస్కారం కల్పిస్తే ఎంపీడీవోలు, ఏపీవోలను కూడా సస్పెండ్‌ చేసేందుకు వెనుకాడబోమని కలెక్టర్‌ హెచ్చరించారు. ఇప్పటికే అనేక పర్యాయాలు సూచనలు చేయడం జరిగిందని, ఇకనుండి ఎలాంటి నోటీసులు, ఛార్జ్‌ మెమోలు ఇవ్వకుండానే నేరుగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తేల్చి చెప్పారు.

అవెన్యూ ప్లాంటేషన్‌, ఇన్‌ స్టిట్యూషనల్‌ ప్లాంటేషన్‌ నూటికి నూరు శాతం పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. తాను క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపినప్పుడు వర్ని, చందూర్‌, మోస్రా మండలాల పరిధిలో మొక్కల నిర్వహణ చక్కగా కనిపించిందన్నారు. అయితే నిజామాబాదు మండలంతో పాటు, బోధన్‌కు వెళ్లే మార్గంలో జాతీయ రహదారికి ఇరువైపులా హరితహారం నిర్వహణలో అనేక లోపాలు కనిపించాయని సంబంధిత అధికారుల పనితీరును ఆక్షేపించారు. నిజామాబాదు, బోధన్‌ ఎఫ్‌ఆర్‌ఓలు కూడా తీవ్ర అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పనిచేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని సూచించారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని చిత్తశుద్ధితో పని చేయకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. డీపీవో, జడ్పీ సీఈవో, డీఎల్పీవోలు, డీఆర్డీవో తదితర జిల్లా అధికారులు ప్రతి రోజు ఒక మండలం చొప్పున హరితహారం మొక్కల పెంపకం, నిర్వహణ తీరును నిశిత పరిశీలన జరిపి తనకు రోజువారీగా నివేదిక అందించాలని కలెక్టర్‌ ఆదేశించారు. మొక్కలను పూర్తి స్థాయిలో సంరక్షించేందుకు వాటి చుట్టూ తప్పని సరిగా ట్రీగార్డులను ఏర్పాటు చేసి, మొక్కకు, ట్రీగార్డుకు సపోర్టుగా ఉండేలా గట్టి కర్రను పాతాలన్నారు.

అదేవిధంగా మొక్కకు కనీసం 12 లీటర్ల నీరు పెట్టె విధంగా దాని చుట్టూ గుంత తవ్వించాలని సూచనలు చేశారు. ఏదైనా కారణం వల్ల ఎక్కడైనా మొక్క చెడిపోతే దాని స్థానంలో కొత్త మొక్క నాటాలన్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు, ముఖ్యమంత్రి తదితర ముఖ్యులు జిల్లా పర్యటనకు వచ్చిన సమయంలో మొక్కల నిర్వహణ సరిగా లేదని ఆక్షేపణ తెలిపేందుకు ఎంతమాత్రం ఆస్కారం లేకుండా ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ హితవు పలికారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ ఏ రోడ్డు అయినా హరితహారం నిర్వహణ బాధ్యత ఎంపీడీవోలు, ఏపీవోలదేనని స్పష్టం చేశారు.

కాగా, వరి నాట్ల సీజన్‌ దాదాపుగా ముగిసినందున జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటినుండి వచ్చే జూన్‌ నెల వరకు విరివిగా ఉపాధి హామీ పనులు చేపట్టేలా గ్రామం వారీగా సమగ్ర ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. పది శాతం కంటే తక్కువ మోతాదులో కూలీలకు పనులు కల్పిస్తే సంబంధిత ఏపీవోలు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రధానంగా భూగర్భ జలాల పెంపుదల, సోక్‌ పిట్ల నిర్మాణం పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా నర్సరీలను ఆయా గ్రామాల వారీగా ఏర్పాటు చేసుకుని వాటిని సక్రమంగా నిర్వహించుకోవాలన్నారు. అటవీ శాఖా అధికారులు నర్సరీలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని కలెక్టర్‌ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రా, డీఎఫ్‌ఓ సునీల్‌, డీఆర్‌డివో చందర్‌, డీపీవో జయసుధ తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »