కామారెడ్డి, జనవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి దశల వారీగా పీసీసీ చర్యలు తీసుకుంటోందని, సీనియర్లంతా పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను ముందుకు తీసుకెళుతున్నామన్నారు. పార్టీ బలోపేతంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దృష్టి సారించారని, అందులో భాగంగా సోనియాగాంధీ పుట్టిన రోజు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వెలువడిన రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ డిజిటల్ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 34 వేల మందికిపైగా డిజిటల్ సభ్యత్వ నమోదుపై పీసీసీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి క్షేత్రస్థాయిలో భాగస్వామ్యం చేశారన్నారు. ఏఐసీసీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని వారం, వారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షేత్ర స్థాయిలో సమీక్ష చేస్తున్నారని షబ్బీర్ పేర్కొన్నారు.
సభ్యత్వ నమోదు మరింత సమర్ధంగా జరిగేందుకు అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా పరిశీలకులను, పార్లమెంటు నియోజక వర్గాలవారీగా ఇన్చార్జిలను నియమించారన్నారు. జిల్లాలోని అన్ని స్థాయిల నాయకులు భాగస్వామ్యం కావాలని సూచించారు. డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి క్షేత్రస్థాయిలో మంచి స్పందన వస్తోందని షబ్బీర్ అలీ చెప్పారు.
ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి రెండు లక్షలు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 30 వేలు, బూత్‌కు వంద లెక్కన సభ్యత్వాలను పూర్తి చేయాలని పీసీసీ లక్ష్యాలను నిర్దేశించిందన్నారు. క్షేత్రస్థాయిలో ఉత్సాహంగా సభ్యత్వాన్ని నిర్వహించిన వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బూత్ స్థాయిలో పీసీసీ నిర్దేశించినట్లు వందకు బదులు రెండు వందలు అంతకు మించి సభ్యత్వం పూర్తి చేయించినట్లయితే వారిని హైదరాబాద్‌కు పిలిపించి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో శాలువాతో సన్మానం చేయిస్తామన్నారు. ఏఐసీసీ 30 లక్షలు లక్ష్యంగా నిర్దేశించగా తాము మాత్రం 34 లక్షల సభ్యత్వాలను పూర్తి చేయాలని నిర్ణయించి ఆ మేరకు క్షేత్రస్థాయి ప్రయత్నం చేస్తున్నామన్నారు.
కార్యక్రమానికి సమన్వయకర్తగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రమేష్ పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.