నసురుల్లాబాద్, జనవరి 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీపై తెరాస నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని నసురుల్లాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు చందూరి హన్మాండ్లు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి తెరాస నాయకులు రైతుల విషయంలో బీజేపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖడిస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకుండా కేవలం రైతు బంధు ఇస్తూ రైతులను మోసం చేస్తుందని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఎరువుల కొరకు సుమారు 80 వేల కోట్ల సబ్సిడీ భరిస్తుందని, రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, పెరిగిన ధరల భారం వారిపై పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
తెరాస ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో తరుగు పేరిట, సుత్తిలి, హమాలీ డబ్బులు ఇవ్వకుండా రైతులను మోసం చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా తెరాస నాయకులు చేసిన తప్పుడు వాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, లేని యెడల రైతులు తగిన గుణపాఠం చెపుతారాని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి శంకర్, మండల ఉపాధ్యక్షులు మేకల రామన్న, గంగాధర్ గుప్తా, సాయికుమార్, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.