నిజామాబాద్, జనవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటింటి ఆరోగ్యం సర్వే, హరితహారం మొక్కల నిర్వహణ, కొవిడ్ నియంత్రణకై చేపడుతున్న వాక్సినేషన్ కార్యక్రమాలకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్ లో జిల్లా అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇంటింటి ఆరోగ్యం సర్వే వివరాల గురించి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం వివరాలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. జిల్లాలో మొత్తం 3 లక్షల 48 వేల 941 నివాస గృహాలు ఉండగా, సర్వే నిమిత్తం 1240 బృందాలను నియమించామని వెల్లడిరచారు. ఇందులో మొదటి రోజైన శుక్రవారం 106093 ఇళ్లను సందర్శించి సర్వే పూర్తి చేశారని తెలిపారు. మొత్తం 383891 మందిని సర్వే జరుపగా, వారిలో 1835 మందికి జ్వరం లక్షణాలు ఉన్నట్టు గుర్తించామని అన్నారు.
దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, ఏ ఒక్క నివాస గృహం తప్పిపోకుండా అన్ని నివాస ప్రాంతాల్లో పకడ్బందీగా ఇంటింటి సర్వే జరిపించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి సర్వేను నిశితంగా పరిశీలన జరపాలని అన్నారు. అదేవిధంగా కొవిడ్ నియంత్రణ కోసం చేపడుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ప్రధానంగా ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రికాషనరీ డోస్ తప్పనిసరిగా అందేలా ఆయా శాఖల అధికారులు చొరవ చూపాలన్నారు.
ఇదిలా ఉండగా, 2020 ` 2021, 2021 – 2022 సంవత్సరాల్లో ఆయా శాఖల వారీగా నాటిన మొక్కల వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపించి నివేదిక అందించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. గణాంకాలకు అనుగుణంగా క్షేత్ర స్థాయిలో మొక్కలు ఉన్నాయా లేవా అన్నది గమనించాలని, ట్రీ గార్డులు ఎన్ని, ఎంత మంది వనసేవకులను కేటాయించాము, వారంతా పని చేస్తున్నారా తదితర వివరాలను అందించాలన్నారు.
ఈ వివరాలు వాస్తవ పరిస్థితికి అద్దం పట్టాలని, తప్పుడు నివేదికలు ఇస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, ఇతర శాఖల వారితో క్రాస్ వెరిఫికేషన్ జరిపిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. నామ్ కె వాస్తే అన్నట్టుగా పనిచేసే జిల్లా అధికారులను సరెండర్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. తాను స్వయంగా ఆయా శాఖల వారీగా సంబంధిత అధికారులను వెంటబెట్టుకుని క్షేత్ర స్థాయిలో మొక్కల నిర్వహణను పరిశీలిస్తానని, లోపాలు ఉన్నట్టు తేలితే అధికారులే బాధ్యత వహిచాల్సి వస్తుందన్నారు.
సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మకరంద్, డీఎఫ్‌ఓ సునీల్, జెడ్పి సిఈఓ గోవింద్, డీఆర్డీవో చందర్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా సమావేశం అనంతరం జిల్లా నాబార్డు ఆధ్వర్యంలో ఆయా రంగాల వారీగా రూపొందించిన ప్రణాళికను డీడీఎం కే.నాగేష్ తో కలిసి కలెక్టర్ విడుదల చేశారు.