కామారెడ్డి, జనవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణంలోని 37 వ వార్డులో జ్వరం సర్వేను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. సర్వేకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. సర్వే బృందం ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబంలో ఎవరికైనా దగ్గు, జ్వరం తో బాధపడుతున్న వారు ఉన్నారా అని అడిగి తెలుసుకోవాలని చెప్పారు.
స్వల్ప లక్షణాలున్నవారికి హోమ్ ఐసోలేషన్ కిట్లను అందజేయాలని కోరారు. ఇంటి వద్ద చికిత్స పొందుతున్న వారిని వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేసుకోవాలని కోరారు. జిల్లాలో కరోనా అదుపులో ఉందని పేర్కొన్నారు. కరోనా విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు.
జ్వరం సర్వే జరుగుతున్న తీరును రెండు కుటుంబాల వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వేను సజావుగా కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మెప్మా పిడి శ్రీధర్ రెడ్డి, వైద్యాధికారి సుజాత్‌అలీ, మెప్మా, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.