కామారెడ్డి, జనవరి 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాడ్వాయి మండలం కృష్ణాజి వాడిలో శుక్రవారం జ్వరం సర్వేను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. కరోనా వ్యాధి రాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించడమే శ్రీరామరక్ష అన్నారు. కరోనా వ్యాధి వచ్చాక ఇబ్బందులు పడే కంటే వ్యాధి రాకుండా మూడు సూత్రాలు పాటిస్తే వ్యాధి రాదని సూచించారు.
ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ రెండు టీకాలు తీసుకోవాలన్నారు. 60 సంవత్సరాలు నిండిన వారు బూస్టర్ డోస్ తప్పనిసరిగా వేయించుకోవాలని పేర్కొన్నారు. సర్వే సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వారి వివరాలు సేకరించాలని కోరారు. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి తదితర లక్షణాలు ఉంటే వారి పేర్లు నమోదు చేసుకొని మందుల కిట్టు అందజేయాలని సూచించారు.
ఇంటి వద్ద చికిత్స పొందుతున్న వారిని వైద్య సిబ్బంది ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. సర్వేను నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, వైద్యాధికారి రవీందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి చంద్రకళ, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.