యువత సన్మార్గంలో పయనించేందుకు క్రీడలు దోహదం

నిజామాబాద్‌, జనవరి 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత దురలవాట్లను దూరం చేసుకుని సన్మార్గంలో పయనించేందుకు క్రీడలు ఎంతగానో దోహద పడతాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తమ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తోందని అన్నారు. నిజామాబాదు జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో 2 .5 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన మినీ స్పోర్ట్స్‌ స్టేడియంకు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు. అంతకు ముందు మోర్తాడ్‌ మండలం తిమ్మాపూర్‌ ఎక్స్‌ రోడ్డు నుండి కమ్మరపల్లి శివారు గండి హనుమాన్‌ మందిరం వరకు రూ.5 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు, కమ్మరపల్లిలో 50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న డ్రైనేజీల నిర్మాణం పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.

అదేవిధంగా కమ్మర్‌ పల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 40 లక్షల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మినీ స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మంత్రి వేముల ప్రసంగించారు. గతంలో యువత పెద్ద సంఖ్యలో క్రీడల్లో పాల్గొనేవారని, ప్రస్తుతం సోషల్‌ మీడియా వాడకానికి అలవాటు పడినందున క్రీడల పట్ల అంతగా ఆసక్తి ప్రదర్శించడం లేదన్నారు.

జీవితంలో స్థిరపడేందుకు, ఉద్యోగావకాశాలు పొందేందుకు క్రీడలు ఎంతో ఉపకరిస్తాయని మంత్రి హితవు పలికారు. గతంలో స్పోర్ట్స్‌ కోటా కొన్ని శాఖలలోనే అమలయ్యేదని, ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధికారం లోకి వచ్చిన అనంతరం అన్ని ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లోనూ స్పోర్ట్స్‌ కోటా ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. ఈ కోటాను ఉపయోగించుకుని అనేక మంది క్రీడాకారులు ఉద్యోగావకాశాలు పొందారని గుర్తు చేశారు.

కాగా, తెలంగాణలో తెరాస ప్రభుత్వం అధికారం చేపట్టిన మీదట గడిచిన ఏడేళ్ల కాలంలో లక్షా 32 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందన్నారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలోనే 40 వేల కొలువులు తమ ప్రభుత్వ హయాంలో కొత్తగా భర్తీ అయ్యాయని వివరించారు. అంతేకాకుండా టీఎస్‌ ఐపాస్‌ విధానం ద్వారా అనుకూల పరిస్థితులు ఏర్పర్చడంతో కొత్తగా 17 వేల పరిశ్రమలు నెలకొల్పబడ్డాయని, రూ. 2.25 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. తద్వారా ప్రైవేట్‌ రంగంలో మరో 13 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని అన్నారు.

గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్‌ తదితర ఏ రాష్ట్రాలలోనూ ఇంత పెద్ద సంఖ్యలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఉద్యోగాల కల్పన జరుగలేదన్నారు. అయినప్పటికీ కొంత మంది తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఉద్యోగాలు భర్తీ చేయడం తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని ఆక్షేపించారు. యువత, ప్రజలు వాస్తవాలను గుర్తెరగాలని కోరారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు కేవలం రూ. 50 వేల కోట్లు ఉండగా, వాటిని రూ. 2.18 లక్షల కోట్లకు పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి వేముల పేర్కొన్నారు.

తమ ప్రభుత్వ పనితీరు ప్రణాళికా బద్ధంగా ఉన్నందువల్లే రాష్ట్ర తలసరి ఆదాయం లక్షా 20 వేల నుండి రెండు లక్షల 18 వేల రూపాయలకు పెరిగిందని అన్నారు. తాను చెబుతున్న ఈ విషయాలన్నీ నూటికి నూరు శాతం వాస్తవాలని, ఒక వేళ ఎవరైనా తప్పు అని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, లేనట్లయితే విమర్శలు చేసే వారు రాజీనామా చేస్తారా అని వేముల సవాల్‌ చేశారు.

కాగా, కమ్మర్‌ పల్లి మినీ స్టేడియం ఆవరణలో ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. యువత దురలవాట్లకు దూరంగా వుంటూ క్రీడల పట్ల ఆసక్తిని ఏర్పర్చుకోవాలని, వారికి అన్ని విధాలుగా తనవంతు సహకారం అందిస్తానని అన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి స్వర్గీయ వేముల సురేందర్‌ రెడ్డి క్రీడా రంగానికి అందించిన సేవలను మంత్రి ప్రశాంత్‌ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తన తండ్రి జిల్లా క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉండేవారని, ఆయనతో కలిసి క్రికెట్‌ ఆడే అవకాశం తనకు కూడా దక్కిందని అన్నారు.

కార్యక్రమాల్లో ఆర్మూర్‌ ఆర్దీవో శ్రీనివాసులు, వాలీబాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మంత్‌ రెడ్డి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ముత్తెన్నతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. సాఫ్ట్‌ బాల్‌ క్రీడా పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను మంత్రి వేముల అభినందిస్తూ సన్మానించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »