కామారెడ్డి, జనవరి 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తల్లిదండ్రులు బాల, బాలికలను సమానంగా చూడాలని సూచించారు. బాలికలు తమకు నచ్చిన లక్ష్యాన్ని ఎంచుకొని దానికి అనుగుణంగా చదువుకొని సమాజంలో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ అధికారి సరస్వతి మాట్లాడారు.

బాలికలు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని కోరారు. ప్రభుత్వ బాలికల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. వివిధ క్రీడలు, పాటలు, సాంస్కృతిక రంగాల్లో రాణించిన బాలికలకు సర్టిఫికెట్లు, బహుమతులు జిల్లా కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, జిల్లా బి.సి.సంక్షేమ అధికారి శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా బాలిక సంరక్షణ అధికారి స్రవంతి, జిల్లా బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ జానకి, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలు స్వర్ణలత, సిడిపివోలు, అధికారులు పాల్గొన్నారు.