నిజామాబాద్, జనవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ప్రతీ యేటా ఎంపిక చేయబడిన యువజన సంఘాలకు ఉచితంగా పంపిణీ చేసే క్రీడా సామాగ్రి కోసం నిజామాబాద్ జిల్లాలోని యువజన సంఘాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా యువజన అధికారిణి, నెహ్రూ యువ కేంద్ర, శైలి బెల్లాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తు చేసుకునే వారికి సూచనలు :
- యువజన సంఘం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. ఇది వరకే రిజిస్ట్రేషన్ కలిగి ఉంటే కొత్తగా రెన్యూవల్ అయి ఉండాలి.
- యువజన సంఘం పేరు మీద బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి.
- యువజన సంఘము నిర్వహిస్తున్న సామాజిక, సేవా కార్యక్రమాల వివరాలు, ఫోటోలు, పేపర్ కటింగ్స్ ఉండాలి.
సామాజిక, సేవా ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ఉపయోగపడే తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యువజన సంఘాలకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసే యువజన సంఘాలు తమ రిజిస్ట్రేషన్ కాపీ జిరాక్స్, తమ యువజన సంఘ సభ్యుల పూర్తి వివరాలు, ఫోన్ నెంబర్‌తో సహా, ఇతర ప్రశంసా పత్రాలు, ఫోటోలు, న్యూస్ పేపర్ కటింగ్స్ జత చెయ్యాల్సి ఉంటుందన్నారు. వచ్చిన దరఖాస్తుల నుండి కమిటీ ద్వారా ఎంపిక చేయబడిన యువజన సంఘాలకు 5 రకాల ఆట వస్తువులు ఉచితంగా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఆఫీసు సమయాల్లో సంప్రదించాలన్నారు.