కామారెడ్డి, జనవరి 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత కుటుంబాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో మంగళవారం చిరు వ్యాపారులకు ఉచిత రుణాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కామారెడ్డి నియోజకవర్గం లో 110 మంది చిరు వ్యాపారులకు యాభై వేల రూపాయల చొప్పున ఉచితంగా ప్రభుత్వం రుణాలను పంపిణీ చేసిందని చెప్పారు.
కిరాణా దుకాణాలు, పాడి గేదెలు, జిరాక్స్ మిషన్, కుట్టు మిషన్లు ఏర్పాటు చేసుకొని ఎస్సీ లబ్ధిదారులు ఆర్థికంగా స్వాలంబన సాధించాలని సూచించారు. కామారెడ్డి నియోజకవర్గంలో దళితులకు 136 ఎకరాల సాగు భూములను ఇచ్చామని చెప్పారు. వచ్చే ఏడాది లోపు కాలేశ్వరం నీళ్లు కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.
దళిత బంధు పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోందని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల పాటు ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్తును అందించి రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు, బీమా పథకాలు ప్రవేశపెట్టి దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. ఎస్సీ లబ్ధిదారులు యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కోరారు. చిరు వ్యాపారులు ఉపాధి పొందుతూ మరో పది మందికి ఉపాధి కల్పించాలని సూచించారు. ఐకెపి, మెప్మా ద్వారా రుణాలు పొంది ఆర్థికంగా బలోపేతం కావాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులను, కుట్టు మిషను పంపిణీ చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.