డిచ్‌పల్లి, జనవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ పరిపాలనా భవనం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మొదటగా మహాత్మా గాంధీ, డా. బి. ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి, జ్యోతి ప్రజ్వలనం చేశారు.
ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మాట్లాడుతూ సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా భారతదేశం ఏర్పడి 73 సంవత్సరాలు అయ్యిందన్నారు. ప్రతి భారతీయుడు స్వేచ్చా, సమానత్వం, సౌభ్రాతృత్వం పొందడానికి బాబాసాహెబ్ డా. బి. ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం ఎంతగానో సహకరించిందన్నారు.
మొట్ట మొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ఆంగ్ల విద్యను ప్రవేశ పెడుతున్నందుకు హర్షం ప్రకటించారు. విజ్ఞాన శాస్త్ర రంగాల అధ్యయనానికి ఈ విధానం ఎంతగానో సహకరిస్తుందన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల విద్యాభ్యసనం ప్రాధాన్యాన్ని వహిస్తున్నారు. అదే విధంగా తాను ఒక ఉపకులపతిగా తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని శాస్త్ర సాంకేతిక రంగంలో పురోభివృద్ధి సాధించడానికి కృషి చేస్తున్నామన్నారు.
తెలంగాణ విశ్వవిద్యాలయానికి న్యాక్ అగ్రిడియేషన్ కోసం ప్రపోజల్ పంపినట్లు తెలిపారు. అధ్యాపక, అధ్యాపకేతరులు న్యాక్ ‘‘ఎ’’ గ్రేడ్ సాధించడానికి సహకారమందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఐసిఎస్‌ఎస్‌ఆర్, యూజీసీ, సిఎస్‌ఐఆర్ తదితర సంస్థల నుంచి ప్రాజెక్టులు, పరిశోధనకు చెందిన ప్రపోజల్స్ పంపాలని ఆయన కోరారు. ఇప్పటికే సైన్స్‌లో జరుగుతున్న ప్రాజెక్టులను గూర్చి వివరించారు.
తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి పంచే ప్రపోజల్స్‌కు స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి స్కాలర్ షిప్స్ సాంక్షన్ జరిగే అవకాశం ఉందన్నారు. త్వరలో స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వివిధ సైన్స్ విభాగాలకు ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకొనే ఏర్పాటులో ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో సైన్స్ బిల్డింగ్ నిర్మాణమవుతున్న విషయాన్ని తెలిపారు. త్వరలో ఎగ్జామినేషన్స్ బ్రాంచ్ బిల్డింగ్ నిర్మాణం చేస్తామన్నారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి ఆన్ స్క్రీనింగ్ వాల్యూయేషన్ ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా అదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని కళాశాలను అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు కోసం ఎఐసిటికి పర్మిషన్ కోసం వెళ్తునట్లు తెలిపారు.
కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు డా. కె. రవీందర్ రెడ్డి, ప్రిన్సిపల్ డా. నాగరాజు, పీఆర్‌ఓ డా. వి. త్రివేణి, డా. రాంబాబు, డా. సంపత్ కుమార్, డా. వాసం చంద్రశేఖర్, డా. ఘంటా చంద్రశేఖర్, డా. సంపత్, డా. బాలకిషన్, సాయాగౌడ్, వినోద్ కుమార్, భాస్కర్, పీడీ నేత, యాదగిరి తదితర అధ్యాపక, అధ్యాపకేతర, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొని జెండా వందనం చేశారు.