డిచ్‌పల్లి, జనవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మహిళా విభాగం ఆధ్వర్యంలో డైరెక్టర్ డా. కె. అపర్ణ 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని వర్చువల్ వేదికగా ఆన్‌లైన్‌లో ‘‘దేశభక్తి పాటల పోటీ’’ నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి చెందిన వివిధ విభాగాల బాలికలు దీప్తి, శ్యామల, అరుణ, వైష్ణవి, లావణ్య, కిరణ్మయి, మహతి, ప్రణతి, నవ్య, శృతి, రమ్య, సంధ్య, లావణ్య తదితరులు పోటీల్లో పాల్గొని తమ పాటలను వినిపించారు. భారతదేశ ఔనత్యం, భారతమాత, త్రివర్ణ పతాకం, భారతదేశ యువశక్తి, స్వేచ్చా, స్వాతంత్య్రాల కాంతి వంటి అనేక అంశాలతో కూడిన పాటలను విద్యార్థినులు పాడారు.
పాటలను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలల్లో పాడడానికి నిర్వాహకులు అవకాశం ఇచ్చారు. కార్యక్రమానికి ప్రముఖ గాత్ర సంగీత పండితులు బి. చంద్రశేఖర్, నవీన్ కుమార్ న్యాయ నిర్ణేతలుగా విచ్చేసి విద్యార్థుల గేయాలను విన్నారు. పాల్గొన్న వారందరికి ప్రశంసా పత్రాలు, మొదటి ఐదుగురికి బహుమతులు అందిస్తామని తెలిపారు. ఫలితాలు తదుపరి వెల్లడిస్తామని చెబుతూ, బహుమతులు గెలుపొందిన వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ప్రదానం చేస్తామని ఆమె తెలిపారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాటల పోటీని నిర్వహించి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతున్న డా. అపర్ణను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ అభినందించారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.