కామారెడ్డి, జనవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వటం లేదని ఖమ్మంలో బయ్యారంకు చెందిన నిరుద్యోగి ముత్యాల సాగర్ (25) రైలు కింద పడి రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడని ఇది ముమ్మాటికీ టిఆర్‌ఎస్ ప్రభుత్వ హత్యయే అని టీయన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు అన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం వేచి చూసి మరో విద్యార్థి తనువు చాలించాడని, తన చావుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కారణం అని తన వాట్సాప్ స్టేటస్‌లో మృతుడు సాగర్ తెలిపాడని, నిరుద్యోగి చావుకి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని టిఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
సాగర్ 2019 లో తన డిగ్రీ పూర్తిచేసి కోచింగ్ సెంటర్‌లో కోచింగ్ తీసుకుని ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్నప్పటికి ఏటువంటి నోటిఫికేషన్స్ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు త్వరలో 50 వేల ఉద్యోగాలు, 40 వేల ఉద్యోగాలు అని పత్రికా ప్రకటన ఇవ్వడం తప్ప ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఉద్యోగాలు వస్తాయనే ఆశతో యువకులు కోచింగ్ తీసుకుని ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడంతో మనస్థాపానికి గురై ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నారనీ ఆందోళన వ్యక్తం చేశారు.
సాగర్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏ ఒక్క నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడవద్దని కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు కూడా కొట్లాడి సాధించుకోవాలన్నారు.