కామారెడ్డి, జనవరి 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా అన్ని రంగాల్లో ప్రగతిని సాధించడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. 73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం క్యాంపు కార్యాలయంలో, కలెక్టరేట్‌లో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లా అధికారులు ఉత్సాహంతో పని చేయాలని సూచించారు. భారత స్వాతంత్య్రం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు జోహార్లు అర్పించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, డిఆర్డివో వెంకట మాధవరావు, కలెక్టరేట్ ఏవో రవీందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.