నిజామాబాద్, జనవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో సాంఘిక బహిష్కరణ చేసిన ఆధిపత్య మున్నూరు కాపు వర్గంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారిపై ఏర్గట్ల ఎస్‌ఐ రాజు బెదిరిస్తూ చంపేస్తా చీరేస్తా అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నందున అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొని ఇతర కులాలను బహిష్కరించిన ఆధిపత్య మున్నూరు కాపు వర్గం పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత బహుజన ప్రజాసంఘాల జేఏసీ నేతలు, తొర్తి గ్రామ ఆదర్శ సంఘ ప్రతినిధులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.
అనంతరం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దళిత బహుజన ప్రజాసంఘాల నేతలు ప్రభాకర్, సావేల్ గంగన్న మాట్లాడుతూ ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో మున్నూరు కాపు ఆదిపత్య వర్గం ఇతర కులాలను సాంఘిక బహిష్కరణ చేసిన విషయమై ఇప్పటికే పలుమార్లు కలెక్టర్, పోలీస్ కమిషనర్, స్థానిక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు.
అయితే మొన్న 24వ తేదీన ఏర్గట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయమై అడగడానికి వెళ్ళిన తొర్తి గ్రామ ఆదర్శ సంఘ ప్రతినిధులతో ఎస్సై రాజు దురుసుగా ప్రవర్తిస్తూ పరిచయం పేరుతో ఒక్కొక్కరిని ఇంటరాగేషన్ మాదిరి వ్యవహరిస్తూ హేళన చేసేలా మాట్లాడారని ఫిర్యాదు విషయమై అడిగితే తనకు తెలియదు అని అంటే మళ్లీ ఫిర్యాదు పత్రం ఇచ్చి రిసీవ్డ్ కాఫీ అడిగితే రిసీవ్డ్ ఏమీ ఇవ్వమని ఈ ఫిర్యాదుపై కేసు కూడా చేయలేమని అంటూ ఎక్కువగా మాట్లాడితే చంపేస్తా చీరేస్తా నాటకాలు ఆడుతున్నారా అంటూ కానిస్టేబుల్‌తో ఈ పిచ్చోళ్లను అందరినీ బయటకు పంపమని కానిస్టేబుల్ చేత బయట వెళ్ళగొట్టించాడు అని దీంతో ఎస్‌ఐ రాజు వైఖరిని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ బయట ఆదర్శ సంఘ ప్రతినిధులు బైఠాయించారు. అయినా పట్టించుకోకుండా వెళ్లిపోయాడని వారు తెలిపారు.
బాధ్యతను విస్మరించి బహిష్కరణకు గురైన ఇతర కులాల పట్ల చులకనగా వ్యవహరిస్తూ ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించిన ఎస్సై రాజుపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, తాము ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని ఆధిపత్యం మున్నూరు కాపు వర్గంపై కేసులు నమోదు చేయాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన తప్పదని వారు హెచ్చరించారు.
కార్యక్రమంలో దళిత బహుజన ప్రజాసంఘాల జేఏసీ నేతలు గట్టు మాణిక్యం, దేవారం, పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్ కుమార్, ఆదర్శ సంఘ ప్రతినిధులు బొజ్జా శ్రీకాంత్, మాదం భూమేశ్వర్, నరసయ్య, ఎర్ర గంగాధర్, ధొన్ పాల లింగం, ఈర్గల గణేష్, జంబుక శంకర్, తోఫారం రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.