హరిత హారంలో ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలి

నిజామాబాద్‌, జనవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న హరితహారం కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ సూచించారు. నాటిన ప్రతి మొక్క సంరక్షణ కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు.

కలెక్టర్‌ నారాయణ రెడ్డి గురువారం డిచ్‌పల్లి నుండి జిల్లా సరిహద్దు బాల్కొండ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు పరిశీలించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నాటిన మొక్కలతో పాటు జాతీయ రహదారుల సంస్థ రోడ్డు మధ్యన నాటిన మొక్కలు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. డిచ్‌పల్లి, సికింద్రాపూర్‌, పడకల్‌, జక్రాన్‌పల్లి, చిట్టాపూర్‌ తదితర గ్రామాల శివార్లలో కలెక్టర్‌ ఒక్కో మొక్క వారీగా నిశిత పరిశీలన చేస్తూ, లోటుపాట్లను ఎత్తి చూపారు.

పలుచోట్ల మొక్కలు ఎండిపోవడం, ట్రీగార్డులు సరిగా లేకపోవడం, నీటిని అందించేందుకు గుంతలు ఏర్పాటు చేయకపోవడం, ట్రీగార్డులు ఉన్నప్పటికీ అసలు మొక్కలే లేకపోవడం, నాటిన మొక్కల చుట్టూ ముళ్ల పొదలు పెరగడం వంటి లొసుగులను గమనించిన కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు ఇలా అస్తవ్యస్తంగా ఉంటే ఉపేక్షించబోమని, అలసత్వం వహించే వారిని సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. తన వెంట అందుబాటులో లేని సంబంధిత అటవీ శాఖ అధికారులకు ఫోన్‌ ద్వారా హెచ్చరికలు చేశారు.

జాతీయ రహదారి అవెన్యూ ప్లాంటేషన్‌ ఎంతో ముఖ్యమైనందున నిర్వహణ పరమైన లోపాలకు ఆస్కారం లేకుండా అంకిత భావంతో పని చేయాలన్నారు. వారం రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి పరిస్థితిని చక్కదిద్దాలని హితవు పలికారు. అటవీ, గ్రామపంచాయతీ, ఎంపీడీవో, ఉపాధి హామీ తదితర శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని, అందుబాటులో ఉన్న నిధులను వినియోగించుకుంటూ ప్రణాళికాబద్ధంగా పనులు జరిపించాలని సూచించారు.

క్షేత్ర స్థాయిలో ప్రతి మొక్కను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఎండిపోయిన మొక్క స్థానంలో కొత్త మొక్క నాటాలని అన్నారు. మొక్క చుట్టూ పెరిగిన పొదలు తొలగించి కనీసం 12 లీటర్ల నీరు పట్టేలా సరైన విధంగా సాసరింగ్‌ చేయించాలని, మొక్కకు సపోర్ట్‌ గా కర్రను పాతి తప్పనిసరిగా ట్రీగార్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొక్కలకు క్రమం తప్పకుండా నీటిని అందిస్తూ, అవసరమైన వాటికి ఎరువు అందిస్తే మొక్కలు ఏపుగా పెరుగుతాయని కలెక్టర్‌ పేర్కొన్నారు.

హైవే పొడుగునా ప్రతి ఐదు కిలోమీటర్ల మేర మొక్కల సంరక్షణ బాధ్యతను బీట్‌ ఆఫీసర్‌లకు అప్పగించాలని ఫారెస్టు అధికారులను ఆదేశించారు. వారం రోజుల తర్వాత మళ్ళీ తాను మొక్కల పరిశీలన కోసం వస్తానని, అదనపు కలెక్టర్‌, ఇతర జిల్లా అధికారులు కూడా తరుచుగా తనిఖీ చేస్తారని అన్నారు. వారం రోజుల స్పెషల్‌ డ్రైవ్‌ తర్వాత కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంటే సంబంధిత అధికారులకు సస్పెన్షన్‌ ఉత్తర్వులు చేతిలో పెట్టడం ఖాయమని కలెక్టర్‌ ఖరాఖండిగా తేల్చి చెప్పారు.

ముఖ్యంగా స్పెషల్‌ డ్రైవ్‌లో అటవీ శాఖ అధికారులు క్రియాశీలకంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కలెక్టర్‌ వెంట సంబంధిత మండలాల ఎంపిడివోలు, ఫారెస్ట్‌ అధికారులు, ఈజీఎస్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »