కామారెడ్డి, జనవరి 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో రైతు కళ్ళాలు నిర్మించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శనివారం ఉపాధి హామీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
ఏపీఓ, ఈసి, సాంకేతిక సహాయకులు ప్రతి ఒక్కరూ ఇరవై ఐదు చొప్పున రైతు కళ్ళాలను నిర్మించే విధంగా చూడాలని సూచించారు. కంపోస్టు షెడ్లు, స్మశాన వాటికలు వాడుకలో ఉండే విధంగా చూడాలని పేర్కొన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలలో 100 శాతం మొక్కలు నాటాలని సూచించారు.
గ్రామాల్లో మురుగు కాలువలు, సిమెంట్ రోడ్ల నిర్మాణం, అంగన్‌వాడి భవనాల నిర్మాణం పనులు ప్రారంభించి, మార్చి 31 లోపు పూర్తిచేయాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో డిఆర్‌డివో వెంకట మాధవరావు, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, ఆర్‌డివోలు శీను, రాజాగౌడ్ పాల్గొన్నారు.