నిజామాబాద్, జనవరి 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల ఆహ్లాదం కోసం ఏర్పాటు చేస్తున్న అర్బన్ పార్క్ పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చిత్రా మిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్‌తో కలిసి నిజామాబాద్ శివారులోని చిన్నపూర్ రిజర్వ్ ఫారెస్టు వద్ద ఏర్పాటు చేస్తున్న అర్బన్ పార్కును సందర్శించారు. ఇక్కడ చేపడుతున్న పనుల ప్రగతి గురించి డీఎఫ్‌ఓ కలెక్టర్‌కు వివరించారు.
అవసరమైన చోట్ల ఛెక్ డ్యాంలు నిర్మిస్తున్నామని, తొమ్మిది పర్కులేషన్ ట్యాంకుల పనులు చురుకుగా జరుగుతున్నాయన్నారు. వాటి వద్ద సోలార్ మోటార్ పంపులు ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. సందర్శకుల సౌకర్యార్ధం 25 లక్షల వ్యయంతో లేక్ వ్యూ నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. పై పనులను కలెక్టర్ స్వయంగా పరిశీలించిన సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
లేక్ వ్యూ పనులను వచ్చే ఏప్రిల్ వరకు పూర్తి చేయాలని, మిగతా అన్ని పనులను కూడా త్వరితగతిన చేపడుతూ, జూన్ నెల నాటికి అర్బన్ పార్క్‌ను ప్రారంభోత్సవం కోసం సిద్ధం చేయాలని సూచించారు. పర్కులేషన్ ట్యాంకులు, చెక్ డ్యామ్‌లలో ఎల్లప్పుడూ నీటి నిల్వలు ఉండేలా చూసుకోవాలని, పార్కు పచ్చదనంతో అలరారినప్పుడే సందర్శకులకు ఆహ్లదకరంగా ఉంటుందన్నారు.
నిధులు అందుబాటులో ఉన్నందున విరామం లేకుండా ఏకబిగిన పనులు జరిపిస్తూ గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యతతో పనులు జరిగేలా చూడాలని, అంకిత భావంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించుకుంటు ముందుకు వెళ్లాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు నిలిచిపోకూడదని అన్నారు.
కాగా, జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలను కలెక్టర్ శనివారం పరిశీలించారు. మామిడిపల్లి, అంకాపూర్, చేపూర్, లక్కోరా, మోర్తాడ్, కమ్మరపల్లి తదితర ప్రాంతాలలో గతేడాది నాటిన మొక్కలు ఎలా ఉన్నాయి, వాటి నిర్వహణను ఎలా కొనసాగిస్తున్నారన్నది కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపారు. ఒక్క మొక్క కూడా చనిపోకూడదని, ఒకవేళ ఏదైనా కారణం చేత మొక్క పాడైపోతే దాని స్థానంలో కొత్త మొక్కను నాటాలని సూచించారు. మొక్కల చుట్టూ కనీసం 12 లీటర్ల నీరు పట్టేలా సాసరింగ్ చేయించాలని, నెలకు పది పర్యాయాలు తగ్గకుండా నీటిని అందించాలని ఆదేశించారు.
వచ్చే నాలుగు నెలల పాటు మొక్కల పట్ల శ్రద్ధ చూపుతూ వాటిని కాపాడుకోగలిగితే పూర్తి స్థాయిలో సంరక్షించబడతాయని పేర్కొన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ సక్రమంగా నిర్వహిస్తే, జాతీయ రహదారి మీదుగా ప్రయాణం సాగించే వారికి ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మొక్కల నిర్వహణ పట్ల ప్రేత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ అధికారులకు హితవు పలికారు. నాలుగైదు రోజుల్లో పనులను చక్కదిద్దుకోవాలని, తాను మళ్ళీ పరిశీలన కోసం వస్తానని పేర్కొన్నారు. ఆయన వెంట అటవీ, పంచాయతీరాజ్, ఉపాధి హామీ తదితర శాఖల అధికారులు పాలొన్నారు.