నిజామాబాద్, జనవరి 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్‌ఆర్ భవన్‌లో కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ వర్ధంతి సందర్భంగా పూలమాలలతో నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోటు రవీందర్, పివైఎల్ జిల్లా అధ్యక్షుడు కిషన్ మాట్లాడుతూ పీవైఎల్ జిల్లా తొలి కన్వీనర్ అయిన వేములపల్లి కిరణ్ కుమార్ యువజన సంఘాన్ని విస్తరించడం కోసం గ్రామాలలో తిరుగుతూ యువతరాన్ని కూడగట్టి పల్లె పల్లెల్లో ప్రజా సంఘాలను పెట్టడానికి విశేషంగా కృషి చేశాడని ఆ క్రమంలో యవ్వన ప్రాయంలోనే ఆకస్మికంగా మృతిచెందాడని అన్నారు.
ప్రగతిశీల యువజన సంఘం అనేక ప్రజా సమస్యలపై పోరాడుతుందని ప్రధానంగా నేడు యువతరాన్ని గంజాయి మద్యం మత్తులో చిత్తు చేస్తూ పాలకవర్గాల దోపిడీని యదేచ్ఛగా సాగించడం కోసం పాలకులు యువతరాన్ని చెడగొడుతున్నారు అని వారు విమర్శించారు. అశ్లీల సాహిత్యం చిత్రాలతో మొబైల్ ఫోన్లలో పోర్న్ సైట్‌లతో చెడగొడుతున్నారని వాటి నుండి యువతరాన్ని సమాజం కోసం ప్రజల కోసం ఆలోచించేలా పోరాడేలా యువతరాన్ని చైతన్యవంతం చేసేందుకు ప్రగతిశీల యువజన సంఘం కిరణ్ కుమార్ స్పూర్తితో అనునిత్యం కృషి చేస్తుందని వారు అన్నారు.
నేడు యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక మరోవైపు 317 జీవో వల్ల ప్రభుత్వ ఉద్యోగులే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకునేలా పాలకుల విధానాలు ఉన్నాయని పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా యువతరాన్ని సమీకరించి ఉద్యమ బాట వైపు నడుద్దామని వారు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు మారుతీ గౌడ్, జిల్లా సహాయ కార్యదర్శి ఆల్గోట్ సాయిలు, జిల్లా కోశాధికారి నారాయణ, జిల్లా నాయకులు మనోజ్, తారాచంద్, విట్టల్, సాయ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.