డిచ్‌పల్లి, జనవరి 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో షీ టీం, నిజామాబాద్ సౌజన్యంతో డైరెక్టర్ డా. కె. అపర్ణ ఆదివారం ‘‘సైబర్ నేరాలు – మహిళా సంరక్షణ’’ అనే అంశం మీద అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో షీ టీం, నిజామాబాద్ మహిళా కానిస్టేబుల్స్ పి. రేఖా రాణి, టి. హరితా రాణి వర్చువల్ వేదికగా ఆన్ లైన్‌లో హాజరై విద్యార్థులకు అవగాహన కలిగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… షీ టీం ఎల్లవేళలా మహిళలకు భద్రతను కల్పిస్తుందని పేర్కొన్నారు. రద్దీగా ఉన్న బస్టాండ్స్, షాపింగ్ మాల్స్, థియేటర్ హాల్స్, పార్కులు మొదలైన ప్రదేశాలలో షీ టీం సిబ్బంది సివిల్ డ్రెస్ లోనే ఉండి బాలికలను ఎల్లప్పుడు సంరక్షిస్తుంటామన్నారు. తెలంగాణ షీ టీం ‘‘హాక్ హై’’ అని బాలికల కోసం ఒక యాప్‌ను రూపొందించిందని, త్వరలో బాలికలకు అందుబాటులో ఉంచనుందన్నారు.
డిజిటల్ స్క్రీన్ మీద ఈనాడు అనేక నేరాలు జరుగుతున్నాయన్నారు. బాలికలు వాటిని గుర్తించి తగు జాగ్రత్త వహించాలని వారు కోరారు. సోషల్ మీడియా ద్వారా విజ్ఞానదాయకమైన విషయం ఎంతగా అవసరం పడుతున్నా, అంతకంటే ఎక్కువగా వేదింపులు అధికమవుతున్నాయని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో బాలికలు తమ ఫోటోలను ప్రదర్శించే సందర్భంలో జాగ్రత వహించాలన్నారు. ఆ ఫోటోస్ మార్ఫింగ్ జరిగి బాలికలను బ్లాక్ మైల్ చేస్తున్నారని తెలిపారు. అందువల్ల డి.పి. రూపంలో ఎక్కడ అమ్మాయిలు తమ ఫోటోలను ప్రదర్శించక పోవడం మంచిదన్నారు.
ఎలాంటి ఇబ్బంది కలిగినా షీ టీం ఫోన్ నంబర్ 94906 18029 కు ఫిర్యాదు చేస్తే వారి సమాచారాన్ని రహస్యంగా ఉంచుతామన్నారు. అంతేగాకా క్యూ ఆర్ కోడ్ పద్ధతి ద్వారా సైబర్ క్రైం మీద ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సాత్విక ద్యాగలి ప్రస్తుతం బాలికల మీద జరుగుతున్న అకృత్యాలను గూర్చి ఒక కవిత రచించి చదివారు. అత్యాధునిక జీవన విధానంలో అత్యంత శర వేగంగా వ్యాపిస్తున్న సైబర్ నేరాల గురించి తెలుసుకొని, విద్యార్థినులు జాగ్రత్త వహించాలని ఉపకులపతి ఆచార్య కె. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్ కోరారు. బాలికా సంరక్షణకు అత్యవసరమైన విషయాల మీద సదస్సులు నిర్వహిస్తున్న డా. కె. అపర్ణను ప్రశంసించారు.