కామారెడ్డి, జనవరి 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలో నూతన పాలకవర్గం ఏర్పాటు తర్వాత జరిగిన అభివృద్ధి పనుల విషయంలో, అవినీతి విషయంలో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, తేదీ, సమయం, స్థలం అధికార పార్టీ కౌన్సిలర్లు చెప్పాలని బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత పాలక వర్గంలో జరిగిన అవినీతి విషయంలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి పిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు అవినీతిని నిగ్గు తేల్చారని అన్నారు. గత పాలకవర్గం కూడా అధికార తెరాస పార్టీ వల్లే అని గుర్తు చేశారు. కొత్త పాలకవర్గం ఏర్పాటు ఆయిన తర్వాత గతంలో కన్నా రెట్టింపు అవినీతి జరుగుతుందని అన్నారు.
పట్టణ ప్రణాళిక, వాటర్ వర్క్స్, సానిటైజేషన్, భవనాల టాక్స్‌లు ఇలా అందు గలదు ఇందు లేదు ఎందెందు వెతికినా అవినీతే కలదని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా జనరల్ బాడీ మీటింగ్‌కి పెట్టిన ఎజెండాను పట్టుకొని ప్రతి అంశంపైనా అందులో జరిగిన అవినీతి పైన చర్చకు సిద్ధమని అన్నారు. వార్డుల వారిగా బడ్జెట్ కేటాయింపుల విషయంలో కూడ చర్చకు సిద్ధమని అన్నారు. ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుందామని అన్నారు.