నిజామాబాద్, జనవరి 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను స్మరించుకుంటూ ఆదివారం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో షహీద్ దివస్ నిర్వహించారు. దేశానికి ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుండి విముక్తి కల్పించేందుకు పోరాడుతూ అసువులు బాసిన స్వాతంత్ర సమరయోధులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్రం కోసం కృషి చేసిన మహనీయులను స్మరించుకునేందుకు ప్రతీ సంవత్సరం జనవరి 30వ తేదీన ప్రభుత్వ ఆదేశాల మేరకు షహీద్ దివస్ నిర్వహించడం జరుగుతుందన్నారు. మహనీయుల స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగుతూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్య్ర సంగ్రామంలో అనేక మంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నాము అన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ మహనీయుల ఆశయాల సాధన కోసం, భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మెప్మా పిడి రాములు, డిఐఈవో రఘురాజ్ తదితరులు పాల్గొన్నారు.