నిజామాబాద్, జనవరి 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం మొక్కలను పశువులు మేస్తే, నిబంధనలకు అనుగుణంగా కఠినంగా వ్యవహరిస్తూ వాటి యజమానులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్‌తో కలిసి కలెక్టర్ నారాయణ రెడ్డి సోమవారం 44వ నెంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు పరిశీలించారు.
డిచ్‌పల్లి, సుద్దపల్లి, గనియతాండ, సికింద్రాపూర్, వివేకనగర్ తండా, అర్గుల్, జక్రాన్‌పల్లి, శ్రీరాంపూర్, వేంపల్లి, పోచంపాడ్ మీదుగా జిల్లా సరిహద్దు వరకు దారి పొడవునా మొక్కల నిర్వహణ తీరుతెన్నులు పరిశీలించారు. పలుచోట్ల మొక్కలు ధ్వంసం అయి ఉండడాన్ని గమనించిన కలెక్టర్, సంబంధిత అధికారులను ప్రశ్నించారు. మొక్కల చుట్టూ ట్రీ గార్డులు ఏర్పాటు చేసినప్పటికీ, మేకలు ఇతర పశువులు వాటిని ధ్వంసం చేస్తూ మొక్కలను పాడు చేస్తున్నాయని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హరితహారం మొక్కలను కాపాడుకునే విషయంలో ఎంతమాత్రం రాజీ పడకూడదని సూచించారు. అనేక వ్యయ ప్రయాసలు ఎదుర్కొంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న హరితహారం మొక్కలను పశువులు ధ్వంసం చేస్తున్నప్పటికీ వాటి యజమానులు, పశువుల కాపరులు కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల హరితహారం లక్ష్యానికి విఘాతం ఏర్పడే ప్రమాదం ఉన్నందున దీనిని తీవ్రంగా పరిగణిస్తూ, బాధ్యులైన వారి పట్ల కొంత కఠినంగానే వ్యవహరించాలని సూచించారు.
మొక్కలు కాపాడుకునే విషయంలో వెనుకంజ వేయకూడదని, అవసరమైతే పోలీసుల నుండి భద్రత తీసుకుని చర్యలకు ఉపక్రమించాలని సూచించారు. మొక్కలు రక్షించేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు చేపట్టే చర్యలకు జిల్లా యంత్రాంగం నుండి పూర్తి మద్దతు ఉంటుందని కలెక్టర్ భరోసా కల్పించారు. కాగా, ఏ ఒక్క మొక్క కూడా ఎండిపోకుండా నెలలో కనీసం పది పర్యాయాలు మొక్కలకు నీరందించాలని సూచించారు. ఈ బాధ్యతను గ్రామ పంచాయతీలు నిర్వర్తించాలని, మొక్కలు ఎక్కువ ఉన్న పక్షంలో ట్రాక్టర్, ట్యాంకర్‌లను సమకూర్చుకోవాలని పంచాయతీ అధికారులు, సర్పంచ్‌లకు సూచించారు.
మొక్కల చుట్టూ కనీసం 12 లీటర్ల నీరు పట్టేలా సాసరింగ్ చేయాలని, ట్రీగార్డు లను సక్రమంగా అమర్చాలని, పిచ్చి మొక్కలు, ముళ్లపొదలను తొలగించి, మొక్కలకు ఎరువు సమకూర్చాలని, ఖాళీ స్థలం కనిపించకుండా అవెన్యూ ప్లాంటేషన్‌ను చక్కగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. జాతీయ రహదారికి ఆనుకుని మొక్కలు పెంచడాన్ని చక్కటి అవకాశంగా భావించాలన్నారు. మొక్కల నిర్వహణ సక్రమంగా చేపడితే, రహదారి మీదుగా రాకపోకలు సాగించే వీఐపీలు, వీవీఐపీల దృష్టిని ఆకర్షించి వారి ప్రశంసలు పొందేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఇంత చక్కటి అవకాశాన్ని పంచాయతీల పాలక వర్గాలు సద్వినియోగం చేసుకోవాలని, మొక్కల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ హితవు పలికారు.
అటవీ, పంచాయతీరాజ్, ఉపాధి హామీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, నాలుగు నెలల పాటు మొక్కలు కాపాడుకోగలిగితే అవి సంరక్షించబడతాయని అన్నారు. కలెక్టర్ వెంట ఆయా మండలాలకు చెందిన సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.