కామారెడ్డి, జనవరి 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్‌వాడి కార్యకర్తలు పిల్లల ఎత్తు, బరువును ప్రతి నెలా తప్పనిసరిగా తీయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం అంగన్‌వాడీ కార్యకర్తలకు మొబైల్ యాప్‌లో పిల్లల, గర్భిణీల వివరాలు నమోదు చేసే విధానంపై అవగాహన కల్పించారు.
సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యాప్‌లో తప్పనిసరి గర్భిణీలకు అందించే పౌష్టికాహారం వివరాలు నమోదు చేయాలని సూచించారు. రక్తహీనత కలిగిన పిల్లల వివరాలు నమోదు చేయాలని కోరారు. బలహీనమైన పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ కార్యకర్తలు క్రియాశీలక పాత్ర పోషించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమాధికారిని సరస్వతి, సిడిపివోలు, శిక్షకులు పాల్గొన్నారు.