నిజామాబాద్, జనవరి 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు అధికారులు విరివిగా యూనిట్లను గుర్తించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సోమవారం స్థానిక ప్రగతి భవన్‌లో దళిత బంధు పథకంపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఇప్పటివరకు గుర్తించిన యూనిట్లు, రూపొందించిన నివేదికల గురించి శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఆరు రంగాలలో 60 వరకు యూనిట్లను గుర్తించడం జరిగిందని, కానీ కనీసం వందకు పైబడి యూనిట్లను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి యూనిట్‌కు సంబంధించి సమగ్ర వివరాలు నివేదికలో పొందుపర్చాలని, ప్రధానంగా ఆయా యూనిట్లను నెలకొల్పితే అవి కొనసాగేందుకు జిల్లాలో అనువైన పరిస్థితులు ఉన్నాయా, లాభనష్టాలెలా ఉంటాయి తదితర అన్ని అంశాలను కూలంకషంగా పరిశీలించాలని సూచించారు.
జిల్లాలో 70 శాతం కుటుంబాలకు వ్యవసాయమే జీవనాధారంగా ఉన్నందున వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాధ్యమైనంత ఎక్కువగా యూనిట్లను గుర్తించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అదేవిధంగా విద్య రంగం, ఐ.టి రంగాలలో కూడా సరికొత్త యూనిట్ల కోసం కృషి చేయాలన్నారు. యూనిట్ల ఖరారు కోసం తుది జాబితాను ఫిబ్రవరి 3 వ తేదీ నాటికి రూపొందించాలని ఆదేశించారు.
అంతకు ముందు ఆయా రంగాలలో ఇప్పటికే వివిధ యూనిట్లను స్థాపించుకుని వాటిని విజయవంతంగా నిర్వహిస్తున్న వారి అనుభవాలు, సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని తుది నివేదికను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నివేదికలు వాస్తవాలతో, సమగ్ర వివరాలతో కూడుకుని ఉండాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ (ట్రైనీ) మకరంద్‌తో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.