నిజామాబాద్, ఫిబ్రవరి 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిర్మాణ పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ మేరకు గ్రామ, మండల స్థాయి ప్రజాప్రతినిధులు తమ వంతు తోడ్పాటును అందించాలని కలెక్టర్ కోరారు.
మంగళవారం కలెక్టర్ తన ఛాంబర్ నుండి వివిధ శాఖల అధికారులతో సెల్ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, సాంఘిక సంక్షేమం తదితర శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల ప్రగతిని సమీక్షించారు. ఇప్పటివరకు చేపట్టలేకపోయిన పనుల విషయమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను ప్రారంభించడానికి ఏవైనా ఆటంకాలు వుంటే తమ పై స్థాయి అధికారుల దృష్టికి తెచ్చి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగాలన్నారు.
ఇప్పటికే నిర్ణీత గడువు ముగిసినప్పటికీ పనులు పూర్తి కాలేకపోయిన వాటి విషయంలో ప్రత్యేక దృష్టిని కేంద్రికరించాలని సూచించారు. ఆర్ధిక సంవత్సరం ముగియడానికి మరికొంత కాలమే వ్యవధి మిగిలి ఉన్న నేపధ్యంలో అభివృద్ధి పనులను వేగవంతంగా జరిపిస్తూ సకాలంలో పూర్తి చేయించేందుకు అధికారులు చొరవ చూపాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చ్ 31వ తేదీ నాటికి నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని, పనులను క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సూచించారు.