నిజామాబాద్, ఫిబ్రవరి 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఖలీల్ అహ్మధ్ మరణం నిజామాబాద్ ఫుట్‌బాల్ ప్రపంచానికి తీరని లోటు అని పలువురు వక్తలు అన్నారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఖలీల్ సంతాప సభ ఏర్పాటుచేశారు.
ఈ సందర్భంగా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ షకీల్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు వెన్నెముక లాగా ఖలీల్ పని చేశారని గుర్తు చేశారు. ఫుట్‌బాల్ కొరకు తన ప్రాణాలను పెట్టి పని చేసే వారని అన్నారు. కేర్ ఫుట్‌బాల్ అకాడమీ అధ్యక్షులు నరాల సుధాకర్ మాట్లాడుతూ ఫుట్‌బాల్ క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఖలీల్ ఎప్పుడు ముందుండేవారని, అర్ధరాత్రి సమయంలో, కరోనా కల్లోల సమయంలో కూడా ఫుట్‌బాల్ క్రీడాకారుల కొరకు నిర్విరామంగా పనిచేసేవారని గుర్తు చేసారు. నైపుణ్యం ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించే వారని అన్నారు.
ఖలీల్ ప్రోత్సాహంతో నిజామాబాద్ నుండి జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు తయ్యారయ్యారన్నారు. కార్యక్రమంలో ఆంద్యాల లింగం, కోచ్ గొట్టిపాటి నాగరాజు సీనియర్ ఫుట్‌బాల్ క్రీడాకారులు భక్తపాల్, కబడ్డీ కోచ్ సుబ్బారావు, అన్వర్, ఖాలెద్, కొయ్యాడ శంకర్, జీవన్ రావు, గిరి తదితరులు పాల్గొన్నారు.