నిజామాబాద్, ఫిబ్రవరి 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా సరిహద్దు ప్రాంతమైన బోధన్ మండలంలోని సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విధుల్లో లేకుండా గైర్హాజర్ అయిన సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్‌ను సస్పెండ్ చేశారు. అదేవిధంగా పీహెచ్‌సిలో అందుబాటులో లేని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రమీలకు వివరణ కోరుతూ ఛార్జ్ మెమో జారీ చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆదేశించారు.
సాలూర పీహెచ్‌సిని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ ఆయా విభాగాలను తనిఖీ చేశారు. ప్రతి రోజు ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లు ఎంత మంది వస్తున్నారు, మందులు అందుబాటులో ఉన్నాయా, కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్‌సీలోని హాజరు పట్టికను తెప్పించుకుని పరిశీలించారు.
ఈ సందర్బంగా సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్, సీహెచ్‌ఓ ప్రమీల విధులకు హాజరైనట్టు అటెండెన్స్ రిజిస్టర్‌లో ఉన్నప్పటికీ వారు విధుల్లో అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేయాలని, అర్ధాంతరంగా విధుల నుండి బయటకు వెళ్లిన సీహెచ్‌ఓ ప్రమీలకు ఛార్జ్ మెమో ఇచ్చి వివరణ కోరాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
అంతకు ముందు ఆయన సాలూర చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ సెంటర్‌ను పరిశీలించారు. కరోనా ప్రబలుతున్న దృష్ట్యా పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ చేసిన మీదటే మన జిల్లా సరిహద్దుల్లోకి అనుమతించాలని సూచించారు.