నిజామాబాద్, ఫిబ్రవరి 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని ప్రగతి భవన్‌లో ధరణి దరఖాస్తులపై కలెక్టర్ సంబంధిత అధికారులతో చర్చించారు. ఒక్కో విభాగం వారీగా అపరిష్క ృతంగా ఉన్న దరఖాస్తుల గురించి ఆయా మండలాల తహసీల్దార్‌లను ఆరా తీశారు.
మూడు రోజుల క్రితం ఇదే అంశంపై సమీక్ష నిర్వహించగా, చాలా వరకు పెండిరగ్ దరఖాస్తులు పరిష్కారం అయ్యాయని అన్నారు. అయినప్పటికీ ఇంకనూ పరిష్కారం కావలసిన దరఖాస్తులు మిగిలి ఉన్నందున వాటిని వెంటనే పరిష్కరించాలని, దీనిని ప్రాధాన్యత అంశంగా భావించాలన్నారు. పదే పదే గడువు పొడిగింపు ఉండదని, ఈ నెల 4వ తేదీ వరకు ఏ ఒక్క దరఖాస్తు పెండిరగులో లేకుండా అన్నింటినీ పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.
2వ తేదీ సాయంత్రం వరకు వచ్చే కొత్త దరఖాస్తులు సైతం నిర్ణీత గడువు లోపే పరిష్కరించాలన్నారు. భవిష్యత్తులో భూములకు సంబంధించి ఎలాంటి వివాదం ఉండకూడదన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ధరణి కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చిందని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని దరఖాస్తులు పరిష్కరించే సమయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంతో జాగ్రతగా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్, ఆయా రెవెన్యూ విభాగాల సూపరింటెండెంట్‌లు పాల్గొన్నారు.